హైదరాబాద్ పురాతన ప్యాలెస్ లు, కోటలు, రుచికరమైన బిరియానీ, హలీంలకు పేరెన్నిక గల నగరం. నిజాంల పాలనలో ఎంతో వైభవంగా వెలిగిన ఈ నగరం ఇప్పుడు భూమిపై అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా ప్రత్యేకతను చాటుతుంది.
పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు… అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన… వినోదం పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో లేనిదంటూ ఏదీ లేదు.
సంపద సృష్టికి ఎంతో అనుకూలమైన ఈ నగరాన్ని భాగ్య నగరం అని కూడా పిలుస్తారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ కు కొత్తగా వెళ్లే టూరిస్టులు వాటిలో తప్పక చూడాల్సిన టాప్ 5 ప్రదేశాల వివరాలు ఇక్కడ చదివి తెలుసుకోండి.
1. ఛార్మినార్:
హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక ‘ఛార్మినార్’. నాలుగు మినార్ లు కలిగిన కట్టడం కావడంతో దీనిని ఛార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో ఛార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి.
ఛార్మినార్ కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్ ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా నాలుగుతో భాగించబడడం విశేషం. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్ ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నలువైపులా ఏర్పాటు చేశారు.