గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. గుండె ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. అయితే మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు మరియు లింగ భేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్‌లు (పూడికలు) వల్ల రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది, దీని ఫలితంగా గుండెపోటు (హార్ట్ ఎటాక్) వస్తుంది.
గుండెపోటు రావడానికి గల కారణాలు
అస్తవ్యస్తమైన జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు:
- మధుమేహం
- అధిక రక్తపోటు (BP)
- అధిక బరువు (ఒబెసిటీ)ను కలిగి ఉండడం
- శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం
- వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడి
- ధూమపానం మరియు మద్యం సేవించడం
- అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం
గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి గల తేడా
గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటి గురించి తెలుసుకోవడం అవసరం.
గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు
- గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది
- గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట మరియు ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది
- గొంతులో మంట
- కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా ఉంటుంది
- తెన్పులు రావడం
గుండెపోటు లక్షణాలు
గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ లక్షణాలతో పాటు:
- గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక, తీవ్రమైన నొప్పి మెడ వరకూ పాకుతుంది
- ఆకస్మిక మైకము, వికారం
- శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది
- ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు
- ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ మరియు కుడి చేతి వరకూ కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది
- నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి మరియు అసౌకర్యం కలిగినా దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించవచ్చు
- గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది
గుండెపోటు యొక్క నివారణ చర్యలు
మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి (డయాబెటిస్ మరియు అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువ)
- ధూమపానం మానేయాలి (గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ మరియు గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు)
- శారీరక శ్రమ మరియు వ్యాయామం తప్పనిసరి (రోజుకూ 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు)
- ప్రతి రోజూ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి (ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి)
- ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు మరియు కేలరీలు ఎక్కువగా, పోషకాహారం తక్కువ వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది
- వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మరియు అధికంగా ఆలోచనలు చేయడం మానేయాలి
- రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రించడం వల్ల గుండె పోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు
- వేరుశెనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకోవాలి
- రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు
అయితే సాధారణంగా 30% పైగా గుండెపోటులు ఈసీజీ (ECG) పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు. వీటితో పాటు:
ల్యాబ్ పరీక్షలు: లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష, కార్డియాక్ ట్రోపోనిన్‌లు (I మరియు T), క్రియేటిన్ కినేస్ (CK), మయోగ్లోబిన్.
ఇమేజింగ్ పరీక్షలు: ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (EKG/ECG), అంబులేటరీ EKG, ఎకోకార్డియోగ్రఫీ, కరోటిడ్ అల్ట్రాసౌండ్, కార్డియాక్ CT, కరోనరీ యాంజియోగ్రఫీ, కార్డియాక్ కాథెటరైజేషన్, ట్రాన్సోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ (TEE) అలాగే ప్రతి సంవత్సరం TMT అనే పరీక్షను చేయించుకోవడం కూడా మంచిది.
పై నియమాలను పాటించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా చాలా వరకు నివారించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.