Kakani Govardhan Reddy: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లతో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, నెల్లూరు, చిత్తూరు జిల్లా చంద్రగిరిల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు దాడులు- ప్రతిదాడులకు దిగారు.
ఈ ఘర్షణలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు టీడీపీపై మాటలదాడికి దిగారు. కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి పేర్ని నాని ఈ వ్యవహారంపై మాట్లాడారు. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటోన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పలు అనుమానాలను లేవనెత్తారు. తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. నెల్లూరులో జరిగిన ఘర్షణలు, గొడవలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు. ఈ మధ్యాహ్నం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరిగాయంటూ ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఎన్నికల అధికారులు.. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించారని, తమపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని ఆరోపించారు. వాళ్ల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.